Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెట్టింపైన ఎయిరిండియా నష్టాలు.. పునరుద్ధరణకు పదేళ్లు పడుతుందన్న ఛైర్మన్

Air India losses double and Chairman says restoration will take ten years
Advertisement
  • 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగిన ఎయిరిండియా నష్టాలు
  • ఎయిరిండియా, ఎక్స్‌ప్రెస్ సంయుక్త నష్టం రూ. 22,238 కోట్లకు చేరిక
  • గత ఏడాదితో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగిన లోటు
  • పునరుద్ధరణకు 5 నుంచి 10 ఏళ్లు పడుతుందన్న ఛైర్మన్ చంద్రశేఖరన్
  • సంస్థను గాడిన పెట్టేందుకు మరికొంత సమయం అవసరమని సంకేతాలు
Advertisement
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు 2026 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను ప్రకటించాయి. ఈ రెండు సంస్థల సంయుక్త నికర నష్టం రూ. 22,238 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 10,859 కోట్ల నష్టంతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఇదే సమయంలో సంస్థల సంయుక్త ఆదాయం కూడా దాదాపు 9 శాతం తగ్గి రూ. 71,870 కోట్లకు పరిమితమైంది.

సంస్థల వార్షిక నివేదికల ప్రకారం.. ఎయిరిండియా రూ. 15,368 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ రూ. 6,767 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఎయిరిండియాలో టాటా సన్స్‌కు 73.82 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా ఉంది.

ఈ ఫలితాలపై వాటాదారులను ఉద్దేశించి ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సంస్థ పునరుద్ధరణను ఒక దీర్ఘకాలిక ప్రక్రియగా చూడాలని సూచించారు. చరిత్రలో ఏ గొప్ప విమానయాన సంస్థ అయినా దశాబ్దాల కాలంలో నిర్మితమైందనీ, అంతేకానీ కొన్ని త్రైమాసికాల్లో కాదని ఆయన స్పష్టం చేశారు. సంస్థను కొనుగోలు చేసిన నాటి పరిస్థితి, విడిభాగాల సరఫరాలో అంతరాయాలు, పాత వ్యవస్థల ఆధునికీకరణ వంటి సవాళ్లను అధిగమించేందుకు 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుందని వివరించారు.

ఛైర్మన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, 2022లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఈ జాతీయ విమానయాన సంస్థను గాడిన పెట్టేందుకు టాటా గ్రూప్ తొలుత అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం, పెట్టుబడులు అవసరమవుతాయని స్పష్టమవుతోంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆరు పాత ఎయిర్‌బస్ ఏ319 విమానాలను విక్రయించేందుకు ఎయిరిండియా ఇటీవలే యూకేకు చెందిన స్కైటెక్-ఏఐసీ సంస్థను నియమించుకుంది.
Advertisement
Advertisement
Air India
Tata Group
N Chandrasekaran
Air India Express
Aviation Industry Losses
Singapore Airlines

More Telugu News